‘ఆ తప్పు చేయకపోతే దేశ విభజన జరిగేది కాదు’

28 Jun, 2018 11:19 IST|Sakshi
అమిత్‌ షా

కోల్‌కతా : ‘కాంగ్రెస్‌ పార్టీ జాతీయ గేయం వందేమాతరాన్ని కూడా విడదీసి చూస్తుంది... తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయానికి మతం రంగు పులుముతుంద’ని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. గురువారమిక్కడ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వారి అధ్వర్యంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ సృష్టికర్త బంకించంద్ర ఛటర్జీ తొలి స్మారకోత్సవానికి అమిత్‌ షా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘జాతీయ గేయమైన వందేమాతరం మన దేశ భౌగోళిక సాంప్రదాయనికి నిదర్శనం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జాతీయతకు ప్రతిరూపమైన ఈ గేయానికి మతం రంగులు పులమడం మంచిది కాదు. 1937లో కాంగ్రెస్‌ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. కానీ వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే తీసుకుంది. ఆనాడు కాంగ్రెస్‌ నాయకులు ఆ తప్పు చేసి ఉండకపోతే దేశ విభజన జరిగేదే కాదు.

కాంగ్రెస్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకుంది. కేవలం ఒక మతం వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ఇలా చేసింది. ఫలితంగా దేశం రెండుగా చీలిపోయింది. కాబట్టి దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే. చాలా మంది చరిత్రకారులు దేశ విభజనకు కారణం ఖిలాఫత్‌ ఉద్యమం, విభజించు - పాలించు విధానం అనుకుంటూ వాటిని విమర్శిస్తారు. కానీ నా వరకూ మాత్రం కాంగ్రెస్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే తీసుకుని దేశ విభజనకు కారణమయ్యింది’ అన్నారు.

మరిన్ని వార్తలు