రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది: దత్తాత్రేయ

2 Aug, 2019 13:23 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి మొదలైందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఎయిమ్స్‌ మంజూరు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని, తామే కేం‍ద్రం ద్వారా నిధులను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది కాలుష్య నివారణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, మూసీ పరివాహక రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బునాదిగాని కాలువ పూర్తి చేయకపోవడం నాయకుల వైఫల్యమేనని విమర్శించారు. మిషన్‌ కాకతీయ ద్వారా ఎక్కడ చెరువులు నిండాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అవినీతి పెరిగిపోతుంది
నయీం కేసులో నిందితులకు శిక్ష అమలు చేసి, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఎదురు లేదని, బీజేపీ సభ్యత్వ నమోదు చూసి టీఆర్‌ఎస్‌ గుండెల్లో గుబులు పుడుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం ‘ఆయుష్మాన్‌ భవ’ రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతుందని, ఆరోగ్య శ్రీ పేరిట జోరుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు