తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

21 Aug, 2019 08:56 IST|Sakshi

మాజీ మంత్రి డీకే అరుణ

సాక్షి, ఆమనగల్లు: త్వరలోనే తెలంగాణ గడ్డమీద బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ప్రజల భ్రమలు తొలగిపోయాయని, ఇన్నాళ్లు కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ప్రజలు రాబోవు రోజుల్లో పిండాలు పెట్టడం ఖాయమన్నారు. ఆమనగల్లు పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖల డివిజన్‌ కార్యాలయాల ఏర్పాటుపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి డీకే అరుణతో పాటు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఆమనగల్లుతో పాటు కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అంతకు ముందు శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాజీవ్‌చౌక్‌ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజలు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుందని, దీనిని జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాపై కేటీఆర్‌ చేసిన ఆరోపణలు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. నడ్డా అబద్దాల అడ్డా కాదని, బీజేపీ తెలంగాణ అడ్డగా మారుతోందనే విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రహించాలన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజమాబాద్‌లో కవితకు పట్టిన గతే, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లకు తప్పదన్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు లేక పేద ప్రజలకు వైద్యం అందడం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి..
జిల్లాల పునర్విభజనలో భాగంగా నాలుగు మండలాలను రంగారెడి జిల్లాలో కలపడం జరిగిందని, అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట లేక ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆచారి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఆమనగల్లు పట్టణంలో డివిజన్‌ కేంద్రంలో ఉండే అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు  ముందు భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొరటి నర్సింహ, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్, సెన్సార్‌ బోర్డు సభ్యుడు రాంరెడ్డి, వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు మోహన్‌రెడ్డి, కుమార్, వెంకటేశ్,లక్ష్మణ్, నాయకులు శ్రీకాంత్‌సింగ్, శేఖర్, శ్రీను, విజయ్‌కృష్ణ, సాయి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.బహిరంగ సభలో పాల్గొన్న డీకే అరుణ, ఆచారి తదితరులు 

మరిన్ని వార్తలు