‘తల్లి, బిడ్డ సెంటిమెంట్‌.. ప్రజలు అమాయకులు కాదు’

24 Nov, 2018 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యూపీఏ ఛైర్‌పర్సన్‌  సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ముందు తల్లి, బిడ్డ సెంటిమెంట్‌ పండించాలని చూసినా నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయానికి పచ్చాత్తాప పడతారనుకుంటే.. ఓట్లు అడగవచ్చారు అంటూ మండిపడ్డారు. ఆంధ్రా మీద కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే హోదా ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. యాభైఏళ్లుగా కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలది కుటుంబపాలన అని, కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే మరి 2014లో ఎందుకు అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు.

ఒవైసీ.. 11తరువాత మా పవర్‌ ఏమిటో చూపిస్తా అంటే సీఎం స్పందించరన్నారు. ఎంఐఎం పొగరు దించాలంటే బీజేపీ గెలవాలన్నారు. ప్రజల పవర్‌ ఏంటో మజ్లిస్‌కు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌కు దమ్ముంటే తెలంగాణ అంతా ఎందుకు పోటీ చేయదని ప్రశ్నించారు. అమిత్ షా 4 రోజులు, నరేంద్ర మోదీ 2 రోజుల తెలంగాణ పర్యటన ఉంటుందని తెలిపారు. 25న అమిత్ షా దుబ్బాకలో, 27న నిజామాబాద్ మహబూబ్‌నగర్‌లలో పర్యటన ఉంటుందన్నారు. డిసెంబర్‌ 3వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు