‘అందుకనే టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు’

26 Sep, 2018 17:26 IST|Sakshi
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, కామారెడ్డి : టీఆర్‌ఎస్‌ పార్టీలోని నియంతృత్వం భరించలేకే ఆ పార్టీ నేతలు బీజేపీలోకి చేరుతున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌పై పోరాడే శక్తి బీజేపీకి తప్పా కాంగ్రెస్‌కి లేదని వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నేతలు బుధవారం టీఆర్‌ఎస్‌ను నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మణ్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి ముందస్తు ఎన్నికల నాటకమాడుతున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. 

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పోకడలను ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాహుల్‌ గాంధీ పూటకో వేషం ధరించినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మోదీ ఇమేజ్‌ దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ శతవిధాల ప్రయత్నిస్తోందనీ, ప్రజలు అబద్ధాలు నమ్మరని అన్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నదనీ, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తమ పార్టీ పాగా వేస్తుందని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు