‘బాబు అవినీతి కాంగ్రెస్‌కు కనిపించదా’

22 Jul, 2018 14:18 IST|Sakshi
బీజీపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవటానికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్‌ ఎందుకు సహకరించిందో అర్థం కాలేదన్నారు.

చంద్రబాబు చేస్తున్న అవినీతి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, మోదీ బలమైన నాయకుడు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అవినీతి బయట పెట్టినందుకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు కోరిక మేరకే ప్యాకేజీ ఇచ్చారని, చంద్రబాబు ప్రత్యేకహోదా అడగలేదని తెలిపారు. ప్యాకేజీ కింద చంద్రబాబు మోదీని 5 వేల కోట్లు అడిగారని, మోదీ మాత్రం 16,500కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు.

రాష్ట్రంలో జన్మభూమి బ్రోకర్ల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దని మాట్లాడిన క్లిప్పింగ్స్‌ను బీజేపీ నేతలు స్ర్కీన్‌ మీద ప్రదర్శించారు. ప్యాకేజీ ఇచ్చినందుకు వెంకయ్యనాయుడిని రాష్ట్రమంతా తిప్పి టీడీపీ నాయకులు సన్మానాలు చేశారని గుర్తుచేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకే అసెంబ్లీలో మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం చేశారని తెలిపారు. ప్యాకేజీపై అరుణ్‌ జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించి స్వాగతించిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు.

>
మరిన్ని వార్తలు