‘11 మందిని హత్య చేయిస్తే నాపై కేసు ఎందుకు పెట్టలేదు’

23 Jan, 2019 16:31 IST|Sakshi

కపిల్‌ సిబల్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కిషన్‌ రెడ్డి

ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలి

రాజకీయ దురుద్దేశంతోనే నాపై ఆరోపణలు : కిషన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌, భారత హ్యాకర్‌ సయ్యద్‌ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్‌ గాంధీ, సిబల్‌, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్‌ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.చనిపోయిన వాళ్లపై మిస్సింగ్‌ కేసులు ఎక్కడ నమోదయ్యాయో, షుజా చెప్తున్న గెస్ట్‌ హౌజ్‌ ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని ఆరోపించారు.

2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. తమను చంపేయమంటూ గన్‌మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ షుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని ఆరోపించారు.

ఇది చదవండి : 2014లో రిగ్గింగ్‌ జరిగింది!

మరిన్ని వార్తలు