‘చంద్రబాబు, మమత తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారు’

20 Feb, 2019 13:55 IST|Sakshi

బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌ రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచంలో ఎక్కడైనా, ఏదైనా ఉగ్రదాడి జరిగిందంటే దానికి పాకిస్తాన్‌తో సంబంధం ఉంటుందని అందరికీ తెలుసునని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పుల్వామా దాడికి భారత్‌ మొత్తం ప్రతీకారం కోరుకుంటోందని పేర్కొన్నారు. ఘటన జరిగిన ఇన్నాళ్ల తర్వాత పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. భారత్‌ నుంచి ప్రతీకార చర్య ఉంటుందని భావించినందు వల్లే.. మా జోలికి వస్తే దాడి చేస్తామంటూ ఇమ్రాన్‌ బీరాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్‌ వైఖరి మారలేదని మండిపడ్డారు. ‘నయా పాకిస్తాన్ అని ఇమ్రాన్‌ ఖాన్‌ అంటున్నారు.. నువ్వు కొత్త కావచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడూ ఉగ్రవాదుల దేశమే. ఉగ్రవాదుల అడుగులకు మడుగులు వొత్తే మిమ్మల్ని ఎవరూ నమ్మరు’ అని విమర్శించారు.

చంద్రబాబు, మమత తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారు
ఎన్నికలకు ముందు ఉగ్రదాడి జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడటం గురించి ప్రస్తావిస్తూ... ‘దేశంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా పుల్వామా ఘటనను అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులు, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మమతా బెనర్జీ బాధ్యత మరిచి ఎన్నికల్లో ప్రజల మద్దతు కోసం మోదీనే ఇలా చేయించారు అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీ మాటలపై ప్రజలు ఆలోచించండి అని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. గోద్రాలో నరమేధాన్ని మరవలేం అని పుల్వామా ఘటనకు ఆయన ముడి వేస్తున్నారు. మోదీ ఏదైనా చేయగలరు అంటున్నారు. ఈ మాటల తో ఎవరికి మద్దతు ఇస్తున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా వీరి మాటలు ఉన్నాయి. మనస్సులో ఉన్న అభద్రతా భావాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దుతున్నారు. దేశ భద్రత ప్రమాదకరంగా ఉందని బాబు అంటున్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తూన్నారు’ అని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.(మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?)

ఇదేనా గుణాత్మక మార్పు?
తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన 66 రోజుల తరువాత.. మంగళవారం నాడు కేసీఆర్‌ తన మంత్రి వర్గాన్ని విస్తరించారని కిషన్‌ రెడ్డి అన్నారు. ‘ఇందులో నలుగురికి అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. మంత్రులలో సమర్థులు ఎవరు లేనట్టు కేసీఆర్‌కి అనిపించింది. కీలమైన అన్ని శాఖల తన దగ్గరే పెట్టుకున్నారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మహిళా మంత్రి లేని ప్రభుత్వం వచ్చింది. గిరిజనలు లేని క్యాబినెట్ ఇది. దేశంలో గుణాత్మక మార్పు ఇదేనా కేసీఆర్‌’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు