‘టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’

17 Sep, 2018 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుందామన్న ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ ఎందుకు మాట తప్పారంటూ బీజేపీ మాజీ రాష్ట్ర ఆధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ కుటుంబంపై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. మజ్లీస్‌ల మద్దతు కోసం తెలంగాణ యోధుల బలిదానాలను మరిచిన కేసీఆర్‌ ప్రజలను ఓట్లు ఎలా అడుతారంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్‌ సీఎంలకు.. నేటి కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయకండి
‘సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవం జరపడం లేదు కాబట్టి.. రజాకార్లపై పోరాటం చేసిన యోధులకు ఇచ్చే పెన్షన్స్‌ రద్దు చేస్తారా? రజాకార్లకు సర్టిఫికెట్‌ ఇస్తారా? అసెంబ్లీ ఎదురుగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ విగ్రహం తీసేసి కాసిం రజ్వీ విగ్రహం పెడతారా?. నిజాం మీద పోరాటం చేసిన పవార్‌, గంగారాం, ఐలమ్మ, కొమురం భీంలను రాజద్రోహులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేస్తారా? రాజకీయ లాభాల కోసం, ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ బాటలో మజ్లీస్‌తో స్నేహం చేస్తూ తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయకండి. దివాలకోరుతనంతో వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించి ఓడించాల్సిందిగా ప్రజలను కోరుతున్నా. కేసీఆర్‌ కుటుంబం రజాకర్లతో కుమ్మక్కై మతోన్మాదాన్ని, గుండాయిజాన్ని పెంచుతోంది. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సమితి.

మీ నాన్న సీఎం కాకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి
బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ప్రజల సమస్యలను, కేంద్రం ఇచ్చిన సహకారం మాత్రమే చెప్పారు. షా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని కేసీఆర్‌ రాజకీయ అపరిపక్వతను, రాజకీయ దిగజారుడు తనానకి నిదర్శనం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న కేసీఆర్‌ కుమారుడు ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్‌ షాను విమర్శించే అర్హత లేదు. కేటీఆర్‌ సీఎం కొడుకు కాబట్టే మంత్రి అయ్యి పెత్తనం చేస్తున్నాడు.. లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేసేవారు’అంటూ కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు