అయిననూ.. హస్తినకేగవలె!

20 Mar, 2019 11:04 IST|Sakshi

ఒకప్పుడు ఢిల్లీ నుంచి నగర రాజకీయాల్లోకి కిషన్‌రెడ్డి

ప్రస్తుతం మళ్లీ ఢిల్లీకి సై అంటున్న మాజీ ఎమ్మెల్యే

ప్రధాని మోడీ ఒక్కప్పుడు ఆయన సహచరుడే

సమకాలికులంతా జాతీయ స్థాయి నేతలే

సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ రేసులో బీజేపీ నేత

అంబర్‌పేట: కొందరు నేతలు గల్లీ నుంచి ఢిల్లీకి వెళితే.. ఆయన మాత్రం ఢిల్లీ నుంచి సిటీకి వచ్చారు. మళ్లీ హస్తినలో పాదం మోపేందుకు కసరత్తు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్న సహచరులను వీడి సొంత నియోజకవర్గంలో పాగా వేసి రాష్ట్ర రాజకీయాలకు ప్రాధ్యాన్యమిచ్చారు. జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పదవులు నిర్వహించిన ఆయన తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి 15 ఏళ్లుగా ఒకే నియోజకవర్గానికి పరిమితమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిప్పటికీ సొంత నియోజకవర్గం అంబర్‌పేటను మాత్రం విస్మరించలేదు. ఆయనే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సికింద్రాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా టికెట్‌ ఆశిస్తున్న కిషన్‌రెడ్డి. 15 ఏళ్లుగా గల్లీల్లో తిరిగిన కిషన్‌రెడ్డి తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తిరిగి ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి సమాయత్తమవుతున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విజయం సాధించి జాతీయస్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  

సికింద్రాబాద్‌ నుంచి సిద్ధంగా..
సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఢిల్లీ బాటపట్టాలని కిషన్‌రెడ్డి సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గవ్యాప్తంగా అనేక అంశాలకు సంబంధించిన అంచనాల్లో ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నాంపల్లి మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉందని భావిస్తున్నారు. బీజేపీకి సికింద్రాబాద్‌ స్థానం సిట్టింగ్‌ కావడంతో కిషన్‌రెడ్డి గెలుపు ధీమాతో ఉన్నారు. ఇక్కడ విజయం సాధించి మరోసారి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 

రాజకీయ ప్రస్థానం ఇలా మొదలు..
కిషన్‌రెడ్డి యువకుడిగా బీజేవైఎం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీజేవైఎం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2002 నుంచి 2004 మధ్యలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన పనితీరును కనబరిచారు. అప్పట్లో ఆయన బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గంలో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, షానవాజ్‌ హుస్సేన్, జేపీ నడ్డా, ప్రస్తుత పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి కృష్ణదాస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. వారంతా జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తే కిషన్‌రెడ్డి మాత్రం 2004లో పూర్వ హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో అంబర్‌పేట ఎమ్మెల్యేగా 2009, 2014లలో వరుసగా విజయాలు సాధించారు.

మరిన్ని వార్తలు