కాంగ్రెస్‌కు రాహుల్‌ గాంధీ.. టీఆర్‌ఎస్‌కు కేటీఆర్‌

20 Aug, 2019 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణసాగర్‌ రావు మాట్లాడుతూ.. 27 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కనీస విచారణ జరపడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల మృతిపై రాష్ట్రపతికి తొందరగా నివేదిక పంపకపోతే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురించి కృష్ణసాగర్‌ రావు ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్‌కు రాహుల్‌ గాంధీ ఎలాగో, టీఆర్‌ఎస్‌కు కేటీఆర్‌ అలా తయారయ్యారు. కేటీఆర్‌ ప్రాస కోసం గోస పడుతున్నారు. అతని కష్టం చూస్తే జాలేస్తోంది. ఆయన మాట్లాడేది అర్థం కాక కొంతమంది జనాలు చప్పట్లు కొడితే కేటీఆర్‌ మాత్రం సంబరపడుతున్నారు. బీజేపీ నాయకులం ఎంత ప్రయత్నించినా కేటీఆర్‌లాగా వ్యక్తిగత దూషణలు చేయడం రాదు. రాష్ట్రానికి అదృశ్య ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ప్రభుత్వ అసమర్థతను మభ్యపెట్టడానికి తన కొడుకుతో ఎదురుదాడి చేయిస్తే సరిపోదు. గడిచిన ఆరు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ బాధ్యతాయుతమైన పార్టీ అనుకున్నాం, కానీ ఆ పార్టీ నేతల మాటలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీలోకి వచ్చేది చెత్త నాయకులు అంటున్నారు, మరి ఆ చెత్త నాయకులను తయారు చేసింది కాంగ్రెస్‌ అని ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీనియర్ నాయకులు వీహెచ్‌ హనుమంతరావును వేదికపై నుంచి గెంటివేస్తే కాంగ్రెస్‌​ నాయకులు కనీసం ఖండించలేదని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు