‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’

16 Sep, 2018 17:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ని ఓడించడానికి అమిత్‌ షా అవసరం లేదని, బీజేపీ సామాన్య కార్యకర్త చాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తో అమిత్‌ షా పోటీ చేస్తే ఓడిస్తామన్న ఓవైసీ సవాల్‌కు స్పందిస్తూ.. మజ్లిస్‌పై సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని కొన్ని సీట్లను గెలవడం కాదు దమ్ముంటే 100 సీట్లల్లో పోటీ చెయ్యాలని సవాల్‌ విసిరారు. 

ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు
ఆదివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అమిత్‌ షా సభ విజయవంతం కావడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ డబ్బులు ఇచ్చి జనాలను తరలించిన ఇంత స్పందన రాలేదన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలన్న భావనతో ప్రజలు ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.

బీజేపీని నేరుగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు అనైతిక పొత్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. అక్టోబర్‌ లోపు 50 బహిరంగ సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రచారానికి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు.సోమవారం హుజుర్‌నగర్‌లో తెలంగాణ విమోచన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామన్నారు. బీజేపీకి అధికారం ఇచ్చి.. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. 
 

మరిన్ని వార్తలు