పీఆర్‌సీ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం

21 Feb, 2020 01:38 IST|Sakshi

ఎన్నికలు వస్తే పీఆర్‌సీ అంటూ మభ్యపెడుతున్న కేసీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపాటు

వెంటనే పీఆర్‌సీ.. లేదంటే ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను వంచించిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్‌సీ లేదా మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే పీఆర్‌సీ అంటూ ఉద్యోగులను మభ్య పెడుతున్నారని మండి పడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల పాలనలో ఒక్క గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలు వస్తే మాత్రం రైతులు, ఉద్యోగులు, పీఆర్‌సీ గుర్తుకు వస్తుందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో త్వరలోనే పీఆర్‌సీపై మాట్లాడదామని మభ్యపెట్టారన్నారు.

ఉద్యోగ సంఘం నాయకులకు భోజనం పెట్టి, ఉద్యోగుల కడుపు కొట్టారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని, ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను దగా చేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఉండి సాధారణ ఉద్యోగుల ప్రయోజనాలు పక్కనబెట్టి కొంతమంది ప్రజా ప్రతిని«ధులు, మంత్రులు అయ్యారన్నారు. ఆర్టీసీ విషయంలోనూ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు ఎప్పుడో ఐఆర్‌ ఇచ్చారని, తెలంగాణలో మాత్రం దిక్కు లేకుండాపోయిందన్నారు. పీఆర్‌సీ గడువును మూడుసార్లు పెంచి ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. పీఆర్‌సీ గడువు పొడగింపు జీవో 447ను వెంటనే రద్దు చేసి, పీఆర్‌సీ ప్రకటించాలన్నారు. లేదంటే ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్రలు బహిర్గతం చేసేందుకే.. 
టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో కుమ్మక్కై మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఒవైసీ వద్ద కేసీఆర్‌ మోకరిల్లి ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారన్నారు. సీఏఏ భారతీయులెవరికీ వ్యతిరేకం కాదన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్రలను బహిర్గతం చేసేందుకు, సీఏఏకు అనుకూలంగా మార్చి 15న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొంటారన్నారు. అనంతరం నార్సింగి సహకార సంఘ ఎన్నికల్లో వైస్‌ చైర్మన్‌గా గెలిచిన కె.సత్యనారాయణను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, చింతా సాంబమూర్తి, శాంతికుమార్, మోహన్‌రెడ్డి, ఎన్‌వీ సుభాష్, సుధాకరశర్మ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు