కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

14 Sep, 2019 12:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. విపక్షంలో ఉన్నపుడు విమోచన దినోత్సవాన్ని జరుపుతామంటూ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ మాటల తీరుతో ఊసరవెల్లి సైతం తలదించుకుంటుందని విమర్శించారు. మాటమార్చిన కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమ కారులను విస్మరిస్తున్నారని, వారి చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్ , డీకే అరుణ , జితేందర్ రెడ్డి, ఆకుల విజయ, ఇంద్రసేనా రెడ్డి, పెద్దిరెడ్డి, వివేక్‌లు శనివారం గవర్నర్‌ తమిళిసైను కలిశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల చరిత్ర వెలుగులోకి రావాలనే ఉద్యమ కారుల చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. సెప్టెంబర్ 17న ఊరు నిండా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పటాన్ చెరువులో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తీరుకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా తమతో కలిసి రావాలని కోరారు. 20 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు