కరోనా కాలంలోనూ రాజకీయ సెగలు

9 May, 2020 14:58 IST|Sakshi
పంకజ ముండే (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : కరోనా కాలంలోనూ మహారాష్ట్రలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. మే 21న రాష్ట్రంలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో సీటు ఆశించిన భంగపడ్డ బీజేపీ నేతల నుంచి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. వీరిలో జాబితాలో బీజేపీ సీనియర్‌ నేత దివంగత గోపినాథ్‌ ముండే కుమార్తె, మాజీ మంత్రి పంజక ముండే ముందు వరుసలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సమీప అభ్యర్థి ధనుంజయ్‌ ముండేపై పోటీ చేసి పంకజ ఓటమి చెందారు. అనంతరం పార్టీ అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మారిన రాజకీయ సమీకరణాల కారణంగా శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మండలి అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో పంకజ తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. దీనికి తోడు ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (మండలి ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌)


అయితే గత శాసనసభ ఎన్నికల ముందే నుంచి పంకజ‌ కాషాయ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలతో ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపించాయి. పంకజ ముండే పార్టీని వీడిపోనున్నారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. తన ఓటమి అనంతరం ‘భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచించుకోవాల్సిన సమయం’ అంటూ ఆమె వివాదాస్పద పోస్ట్‌ పెట్టడం పెద్ద దుమారమే సృష్టించింది. ఆమె బీజేపీకి గుడ్‌బై చెబుతారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. (ఠాక్రే ఎన్నికకు ముహూర్తం ఖరారు)

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై శనివారం స్పందించిన పంకజ పార్టీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేనందుకు ఏమాత్రం కలత చెందడంలేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమెతో పాటు చోటుదక్కని మరికొందరు నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మే 21 మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు