బీజేపీ మహిళా నేత అనూహ్య పోస్ట్‌..!

2 Dec, 2019 13:18 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక,  భవిష్యత్‌ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు పంకజ ముండే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. గత బీజేపీ సర్కార్‌లో పంకజ (40) గ్రామీణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన కజిన్‌ సోదరుడు ధనుంజయ్‌ ముండే చేతిలో 30వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంకజ ముండే తాజాగా పెట్టిన పోస్టు ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతోంది.

‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్‌ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్‌ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె తెలిపారు. బీడ్‌ జిల్లాలోని తన తండ్రి స్మారక కేంద్రం గోపీనాథ్‌ ఘాట్‌ వద్దకు 12వ తేదీన తమ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తన కజిన్‌ ధనుంజయ్‌ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు