నిజమైన దోషులెవరో తేలిపోయింది

21 Jul, 2018 13:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం ఆమె స్పందించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. ఆ కాంగ్రెస్‌ మద్దతుతోనే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్‌లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిటీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్‌ ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. ఏపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనలో సీఎం చంద్రబాబుకు భాగం ఉందని ఆరోపించారు. ఏపీకి ఏమడిగినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న పార్లమెంట్‌లో బీజేపీపై టీడీపీ అబద్ధాలు చెప్పిందన్నారు. దుగరాజుపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కడప స్టీల్‌ ప్లాంట్‌ జాప్యం చంద్రబాబు వల్ల కాదా అని ఆమె ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్‌ కచ్చితంగా ఇస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడలేందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు.

రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం: హరిబాబు
పార్లమెంట్‌లో చంద్రబాబుపై రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని విశాఖ పట్నం ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయలేదనేది ప్రచారమేనని, తప్పకుండా రైల్వే జోన్‌ వస్తుందన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు స్థలం చూపించమని ప్రభుత్వా‍న్ని కోరామన్నారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు అధికారికంగా లేఖలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

దొంగల పార్టీ...
టీడీపీ దొంగల దౌర్జన్య కారుల పార్టీగా మారిందని బీజేపీ అధికార ప్రతినిథి సుదీశ్‌ రాంబోట్ల మండిపడ్డారు. గతంలో ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్‌ తీసుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, మళ్లీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయన తప్పులు తమ మీద నెట్టి కాంగ్రెస్‌తో కలిసి గెలుస్తామనే భ్రమలో ఉన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు