బాబు తీరుపై మండిపడ్డ రాజ్‌నాథ్‌

3 Apr, 2019 16:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చంద్రబాబు నాయుడు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఎప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదని స్పష్టం చేశారు. హోదా ఇవ్వలేక పోయినా దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు.  పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.7 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు.  టీడీపీతో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీకి వచ్చే నిధులు మాత్రం ఆగవని అన్నారు. మచిలీపట్నం పోర్టును శంకుస్థాపన చంద్రబాబు ఎలాంటి పనులను చేపట్టలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మచిలీపట్నం పోర్టును నిర్మిస్తామని, వరికి మరింత గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. 

టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం..
టాప్ 10 దేశాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుందని తెలిపారు. బీజేపీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు తమవిగా చెప్పుకుంటున్నారనిమండిపడ్డారు. రెండున్నర హెక్టార్ల భూమి ఉన్న రైతులకు రూ.6 వేలు కేంద్రం ఇస్తోందని అన్నారు. కానీ, ఏపీలో రైతుల వివరాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడి రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదని వెల్లడించారు. 1984 ఎన్నికల్లో దేశం మొత్తంమీద తమ పార్టీ రెండు సీట్లే గెలుచుకుందని, దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తప్ప మరేమి కనిపించడంలేదని అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

దశాబ్దాలుగా అదే మాట..
అగ్రవర్ణ పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యే నాటికి మొబైల్ ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు రెండే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 126 కు చేరుకుంది. త్వరలో చైనా, రష్యా దేశాల ఆర్థిక వ్యవస్థను భారత దేశం మించిపోతుంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కాంగ్రెస్ హయాంల  బ్యాంకులను మోసం చేశారు. దర్జాగా, ధైర్యంగా దేశంలో తిరిగారు. మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రహించి విదేశాలకు పారిపోయారు. ఆర్థిక నేరగాళ్లను, ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పుల్వామా ఘటన తరువాత మన వాయుసేన పాక్‌ భూభాగంలోకి వెళ్లి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. కానీ, కాంగ్రెస్, టీడీపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌పై అనవసరంగా విమర్శలు చేస్తున్నాయి.పేదరిక నిర్మూలిస్తామని, సంవత్సరానికి రూ.72 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అదే చెప్పారు. దశాబ్దాల అనంతరం రాహుల్‌ కూడా అదే చెపుతున్నారు.

మరిన్ని వార్తలు