ఎంపీగా పోటీ చేయకుండా ప్రధాని ఎలా అవుతారు?

25 Mar, 2019 17:12 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : తెలంగాణలో భయోత్పాద వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఎవ్వరు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంలేదని, భయపెట్టి లాక్కుంటున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ జన్మభూమి తమ ఎన్నికల నినాదం కాదని, కోట్లాది మం‍ది ప్రజల మనోభావాల అంశంగానే రామజన్మభూమిని పరిగణిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులాలను రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అవుతామని అంటున్న నేతలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీలుగా పోటీ చేయకుండా ప్రధానమంత్రి ఎలా అవుతారో చెప్పాలన్నారు. 

కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలేదని మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్తి డీకే అరుణ విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 16 సీట్లు గెలిస్తే తాను ప్రధానిని అవుతానంటూ కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రధానమంత్రి ఎలా అవుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. మహమూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు