బంగారు కాదు.. బందీల తెలంగాణ

8 Nov, 2017 13:05 IST|Sakshi

బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

హన్మకొండ: రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే మరో నిజాం, రజాకార్ల పాలన సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, ఇది బంగారు తెలంగాణ కాదు.. బందీల తెలంగాన అని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుండమీది శ్రీనివాస్‌తో పాటు నాయకులను మంగళవారం సుబేదారి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో రావు పద్మ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరహక్కులను హరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు కుమ్మరించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచేయకుండా టీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని దుయ్యబట్టారు.

సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వారిని దగా చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్న వారిని నిర్భంధించిడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తారని భావించి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచే బీజేపీ, బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. స్వరాష్ట్రం కోసం పోరాడితే అరెస్ట్‌ చేశారని, సాధించుకున్న తెలంగాణలో ఆకాంక్షలు నెరవేర్చాలని కోరితే కూడా అరెస్టులు కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. అరెస్టయిన వారిలో బీజేపీ అర్బన్‌ జిల్లా కార్యదర్శి సంతోష్‌రెడ్డి, బీజైవైఎం, బీజేపీ నాయకులు వంశీచంద్‌రెడ్డి, రాంకీయాదవ్, తాళ్ల శ్యాం, హరీష్, దినేష్, రాజు, శ్రీహరియాదవ్, హరీష్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు