తీవ్ర నిరసన : పాక్‌ హై కమిషన్‌కు చెప్పులు

30 Dec, 2017 08:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ నేవీ ఆఫీసర్‌ కుల్‌భూషణ్‌ జాధవ్‌ కుటుంబసభ్యులతో పాకిస్తాన్‌ వ్యవహరించిన అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్‌ పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు, పాకిస్తాన్‌ హై కమిషన్‌కు ఆన్‌లైన్‌లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్‌ తల్లి, భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు.

కులభూషణ్‌ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. అది తెలియని కులభూషణ్‌ వారిని కలిసిన వెంటనే నాన్నకు ఏమైంది? అంటూ ప్రశ్నించారు. కులభూషణ్‌ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఆయన తల్లిని, భార్యను వితంతువులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్లమెంట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. 

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఆన్‌లైన్‌ చెప్పులను కొనుగోలు చేశారు. వాటి డెలివరీ కోసం పాకిస్తాన్‌ హై కమిషన్‌ అడ్రస్‌ ఇచ్చారు. ''పాకిస్తాన్‌కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి. నేను చెప్పులు ఆర్డర్‌ చేశా. పాకిస్తాన్‌ హై కమిషన్‌కు పంపాను'' అని తాజిందర్‌ పాల్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాక పాకిస్తాన్‌కు చెప్పులు పంపండంటూ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌కు కూడా లాంచ్‌ చేశారు. ఈ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌ హై కమిషన్‌కు వందల మంది భారతీయులు ఫుట్‌వేర్‌ పంపించారు. 

మరిన్ని వార్తలు