‘బాబు చేసిన అప్పు రూ.లక్షా 3400 కోట్లు’

1 Dec, 2018 16:41 IST|Sakshi
సోము వీర్రాజు

కాకినాడ: రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాల అప్పు రూ. 96 వేల కోట్లు అయితే..ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అప్పు  అక్షరాలా రూ.లక్షా 3 వేల 4 వందల కోట్లు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ..నీరు-చెట్టు పథకానికి రూ.15 వేల కోట్లు వెచ్చించినప్పుడు రాష్ట్రంలో కరవు ఎందుకు వచ్చిందని, నీటి మట్టాలు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. దేశంలో దగాకోరు, అవినీతి రాజకీయాలు చంద్రబాబుకే వర్తిస్తాయని వ్యాక్యానించారు. బాబుకు తన రాజకీయ జీవితంలో అధికార ఆలంభన తప్ప సిద్ధాంతాలు లేవని, ఎన్నిసార్లయినా నాలుకను మడతేయగల మనిషి చంద్రబాబు అని తీవ్రంగా విమర్శించారు.

2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారని, ఆయన మనస్సులో ఓ ఫోబియా ఆవహించిందని అన్నారు. బీజేపీతో ఎవరైనా కలిస్తే టీడీపీకి డిపాజిట్లు రావని బాబు భయపడుతున్నారని చెప్పారు. మాతో మిత్రపక్షంగా ఉంటూనే మాకు వ్యతిరేకంగా సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్‌లను ప్రోత్సహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు, పోరాటాలు చేసినా చంద్రబాబు వాటిని అణచివేస్తారని అన్నారు. ఆయన మాత్రం ప్రభుత్వ సొమ్ముతో అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ 13 జిల్లాల్లో కేంద్రంపై ధర్మపోరాట దీక్షలు చేస్తారని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా అన్న వారిపై కేసులు పెట్టించి జైల్లోకి నెట్టిన చంద్రబాబు, ఇప్పుడు అదే హోదా కోసం ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు