వరదలు వస్తుంటే.. ఢిల్లీలో డిన్నర్లా?

14 Aug, 2019 11:55 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య గత శాసనసభ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఓటమి భయంతో బాదామికి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలుపొంది, రాజకీయ పునర్జన్మ కల్పించిన బాదామిని నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములు ఆరోపించారు. శ్రీరాములు మంగళవారం బాదామి నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలో వరద విలయతాండం చేస్తోంది, 17 జిల్లాల్లో వరదలతో జనం ఉక్కిరికిబిక్కిరి అయ్యారన్నారు. బాదామి ఎమ్మెల్యే సిద్ధరామయ్య అనారోగ్యం సాకుతో పర్యటనలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే ఢిల్లీలో డిన్నర్లకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేతలతో కలిసి డిన్నర్లు చేయడానికి సమయం ఉంటుంది కాని రాజకీయ పునర్జన్మ ఇచ్చిన బాదామిని సందర్శించడానికి వీలు దొరకదా? అని ప్రశ్నించారు. ఆయన కుమారుడు యతీంద్ర బాదామిలో పర్యటించడం మంచిదే, అయితే సిద్ధరామయ్య రాకపోవడంతో ఈ ప్రాంతంలోని జనం దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. వరదలతో అల్లాడిపోతున్న జనానికి స్థానిక ఎమ్మెల్యే అయినా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం యడియూరప్ప వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు తెప్పించుకుని వరద బాధితులను ఆదుకుంటామన్నారు.   

మరిన్ని వార్తలు