వైఎస్‌ జగన్‌ కేసు..దర్యాప్తు ఎలా ఉంటుందో

25 Oct, 2018 20:16 IST|Sakshi
బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు

విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌ రాజు స్పందించారు. విశాఖపట్నంలో విష్ణుకుమార్‌ విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై దాడి దిగ్భ్రాంతికరమన్నారు. ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన గంటకే నిందితుడు జగన్‌ అభిమాని అంటూ ఫోటోలు బయటకు రావడం ఇంకా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు.

కేసులో నిజానిజాలు తెలియాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ ద్వారా కోరాలని సూచించారు. నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి ఎవరు దరఖాస్తు చేసినా , అది ప్రజాస్వామ్యంపైనే కుట్ర చేసినట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై దాడి చిన్న విషయం కాదని చెప్పారు. రేపే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షునికి లేఖ రాస్తానని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు