చంద్రబాబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు..

14 Mar, 2019 20:36 IST|Sakshi
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్దన్‌ రెడ్డి(పాత చిత్రం)

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్దన్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విష్ణువర్దన్‌ రెడ్డి గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా జీఓలు జారీ చేస్తోందని ఆరోపించారు. జీఓల జారీలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవినీతి పాలన చేస్తోన్న చంద్రబాబు నాయుడికి అధికారులు సహకరిస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రజల సొమ్మును దోచేశారని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వొద్దని టీడీపీ నేతలు సీఎం ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్‌ పిట్టల దొరలా మారారని  విమర్శించారు. వైఎస్సా‍ర్‌సీపీ, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్ర వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం ఎంపీలు పార్టీని  వీడటంతో చంద్రబాబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. లోకేష్‌కు పౌరుషం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలన్నారు. లోకేష్‌కు నిజంగా దమ్ము దైర్యం ఉంటే పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌పై పోటీ చేసి గెలవాలి.. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. ఎలాగూ ఓడిపోతున్నామని గ్రహించి చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలవరం, రాజధాని పేరుతో కొట్టేసిన డబ్బులతో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. ఏపీలో టీడీపీ నేతలు ప్రచారానికి వెళితే ప్రజలు రాళ్లతో కొడతారని అన్నారు. దేశంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేకుంటే టీడీపీ డబ్బా మూసేస్తారా అని సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు