‘ఏపీ నిరుద్యోగులకు చీకటి  రోజు’

19 Jun, 2018 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్‌ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్‌ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్‌ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్‌ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు చీకటి  రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.  వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. 

‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’  బీజేపీ నేత విష్ణు వర్థన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు