‘సీఎంను ప్రశ్నించినందుకు 9నెలల బిడ్డ ఉన్న మహిళను’..

5 Jan, 2019 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినందుకు చంటిబిడ్డ తల్లిని జైల్లో బంధించారని, అంతు చూస్తా, ఫినిష్‌ అయిపోతారు అనే మాటలు వాడి చంద్రబాబు మరో చింతమనేని, జేసీ, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ స్థాయికి దిగజారారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నేతలను సీఎం బెదిరించిన 24 గంటల్లోనే.. కన్నా ఇంటిమీద దాడి జరిగిందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ రాజకీయాలు చేసేవారు కాల గర్భంలో కలిసిపోతారని అన్నారు. దాడి చేసిన గూండాలను అరెస్ట్‌ చేస్తూ.. బీజేపీ నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల మీద దాడి చేసి, హత్యాయత్నం చేసిన జేసీ అనుచరులను ఆదర్శంగా తీసుకున్నారా.. ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే.. మీ కుటుంబ సభ్యులే! అన్న రాజేంద్రప్రసాద్ మీకు ఆదర్శమా.. ప్రధాని నరేంద్రమోదీని లోఫర్ అన్న నక్కా ఆనంద బాబు మీకు ఆదర్శమా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్సీ ప్రకటన చేసిన 24 గంటల లోపే కన్నా మీద దాడి జరిగిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుని మీద పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గుంటూరులో సాధారణ మైనారిటీలను కూడా.. ప్రశ్నించినందుకు చిత్ర హింసలు పెట్టలేదా. 40 ఏళ్ల అనుభవం ఇదేనా మీది. నాయీ బ్రాహ్మణులు ఆదుకోమని వస్తే బెదిరించారు. కేసీఆర్ మాట్లాడితే సైలెంట్‌గా నటిస్తున్నారు అంటే.. ఓటుకు నోటు కేసులో మీరు దొంగ అని తెలిపోయింది. చంద్రబాబు రైతు ద్రోహిగా మిగిలిపోతాడు. జగన్ మీద హత్యాయత్నం జరిగితే ఎయిర్‌పోర్టు మాది కాదు కేంద్రం చేతిలో ఉంది అన్నాడు. ఇప్పుడు ఎన్‌ఐఏకి కోర్టు ఇస్తే.. టీడీపీ నాయకులు భయపడి పోతున్నారు. అగ్రిగోల్డ్ కేసు కూడా సీబీఐకి ఇస్తారు అనగానే ఎందుకు భయపడుతున్నారు. అయేషా మీరా కేసు సీబీఐకి కోర్టు ఇచ్చింది.

భూముల కుంభకోణంపై హైకోర్టు పిల్ స్వీకరించిందంటే.. తన కేసులు విచారణకు రాకుండా ఉండటానికి కోర్టు అమరావతికి రావొద్దు అన్నారు. చంద్రబాబు దోచుకుని, దాచుకుంటే.. ప్రజలు రక్షణ ఉండాలా. 2014లో బీజేపీతో కలిసే అధికారంలోకి వచ్చారు. 90 రోజుల్లో అధికారం పోతుంది కాబట్టి మీ దోపిడీ బయటకు వస్తుందని మీ భయం. అమిత్‌షా, మోదీ వస్తున్నారంటే.. శాంతి భద్రతలు సరిగా లేవని దొంగ నివేదిక ఇచ్చారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. జనవరి 18న అమిత్‌షా రాయలసీమ వస్తున్నారు.. ఆపండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా జైలు కట్టుకోండి. 90 రోజుల తర్వాత మీ అడ్రస్ అక్కడే ఉంటుంద’’ని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు