హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

12 Jul, 2018 02:20 IST|Sakshi
గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు

పరిపూర్ణానంద నగర బహిష్కరణపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాలని సిద్ధపడ్డ పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రాథమికహక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ నేతలు బుధవారం కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌ రావు, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం తదితరులు గవర్నర్‌ను కలిశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎంఐఎం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, హిందూ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నిస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు.

రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ పరిపూర్ణానందను అకారణంగా బహిష్కరించారని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లక్షలాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తూ పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేశారని.. ఆయనను ఎందుకలా గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

నగర బహిష్కరణ అని, రాష్ట్రం నుంచి ఎలా బహిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదేమైనా నిజాం పాలనా అని ప్రశ్నించారు. విభజన చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హిందువులపై అనుచితంగా, మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం నేతలపై ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు.  

బహిష్కరణ దారుణం: లక్ష్మణ్‌

స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ నిర్ణయం అప్రజాస్వామికం, దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుడిని దూషించి, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపర్చిన వారిపై కఠినంగా వ్యవహరించకుండా పరిపూర్ణానంద పై బహిష్కరణ వేటు వేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం, నగర బహిష్కరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిపూర్ణానంద బహిష్కరణ అంశంపై ప్రభుత్వం, పోలీసులు పునరాలోచించాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎంఐఎం నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  పరిపూర్ణానంద స్వామిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు