‘ఇకపై ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం’

23 Mar, 2019 15:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నరేం‍ద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక ఇండియన్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ ఘననీయంగా పెరిగిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయాల్‌ అన్నారు. శనివారం నగరంలోని క్షత్రియ హోటల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చౌకిదార్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ఐదేళ్ల పాలనలో భారత్‌ అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. బలమైన ప్రధాని ఉంటేనే కఠిన నిర్ణయాలు తీసుకోగలరని అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో సామాన్య ప్రజలకు కూడా రక్షణ ఉందని చెప్పారు. ఉగ్రదాడులను సహించేది లేదని ఇకపై ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెబుతామన్నారు. భగత్‌ సింగ్‌ స్పూర్తితో దేశప్రజలంతా చౌకీదార్‌గా మారాలని పిలుపునిచ్చారు. భారత దేశాన్ని ఒక సూపర్‌ పవర్‌గా తీర్చిదిద్దుతున్న మోదీకి అందరు మద్దతుగా నిలవాలని కోరారు. తెలంగాణలో కూడా బీజేపీ చౌకిదార్‌గా ఉంటుందని, తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రామమందిరం విషయంలో కేసీఆర్‌ స్టాండ్‌ ఏంటి : లక్ష్మణ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందువుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను డైవర్ట్‌ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మండిపడ్డారు. రామమందిరం విషయంలో కేసీఆర్‌ స్టాండ్‌ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సికింద్రాబాద్‌కు చౌకీదార్‌గా ఉంటా : కిషన్‌ రెడ్డి
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌కు చౌకిదార్‌గా ఉంటానని బీజేపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డి అన్నారు. చాలా మంది నేతలు తమ కుటుంబాలకు చౌకిదార్లుగా ఉంటారని, మోదీ ఒక్కరే దేశానికి చౌకిదార్‌గా ఉన్నారన్నారు. ఐదేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా శ్రమించారని ప్రశంసించారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు