మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు : హరిబాబు

16 Feb, 2018 14:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని విద్యాసంస్థల ఏర్పాటు వందశాతం పూర్తి చేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కొన్ని సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు రాలేదని అయినా ఇబ్బందులు తొలగించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై మెకా అనే సంస్థ నివేదిక ఇచ్చిందని, ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం రాష్ట్రప్రభుత్వమే చూపించాలని హరిబాబు డిమాండ్‌ చేశారు. త్వరలోనే రైల్వేజోన్‌పై నిర్ణయం రానుందని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విడుదలలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు వివక్ష ఉండదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత సాయం అందించడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొన్నారు. సంస్థల భవనాల నిర్మాణాల పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. ఏపీ విభజన జరిగిన ఏడాదిలోనే ప్రత్యేక దూరదర్శన్‌ ఏర్పాటు చేశారని, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌లకు 17సంత్సరాల తర్వాత దూరదర్శన్‌ మంజూరు చేశారని గుర్తు చేశారు.

కేంద్రానికి ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందువల్లే అభివృద్ధి చెందుతోందని అన్నారు. తమని పొగడాల్సిన అవసరం లేదని, కానీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిధులు ఇస్తే మా హక్కు లేదంటే మోదీ పాపం అంటూ ప్రచారం చేయడం తప్పు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. తాము కేంద్రం తరపున మాట్లాడుతున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని హరిబాబు అన్నారు.

ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు
ప్రత్యేక హోదాతో ఏరాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఇది కేవలం రాజకీయ అస్త్రమేనని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాయితీలు ఇచ్చామని, ఏడు జిల్లాల్లో ఏం మాత్రం పెట్టుబడులు తెచ్చారో తెలుగుదేశం నేతలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రజలను రెచ్చగొట్టడం, మభ్యపెట్టడం, తమపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ ఏపీ ప్రజల గొంతు కోసిందని, హైదరాబాద్‌లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేసినందుకు తెలుగుదేశం, కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు