టీడీపీకి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి : బీజేపీ

12 Feb, 2018 13:03 IST|Sakshi

టీడీపీ ఎంపీల హెచ్చరికలను పట్టించుకోము

ముష్టి, బిక్షం వంటి పదాలను టీడీపీ నాయకులు కట్టిపెట్టాలి.. బీజేపీ

విజయవాడ :  టీడీపీ నేతలకు దమ్ముంటే నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ రాజు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఏమిచ్చారనే దానిపై  బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వాస్తవాలు వెల్లడించారన్నారు. అయినా టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకే కేంద్రం రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు.

అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందంటూనే, టీడీపీ నేతలు వారితో కలిసి బంద్‌లో ఎలా పాల్గొంటారని శ్యామ్ కిషోర్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో క్లారిటీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కి అన్నిఇస్తున్నామని చెప్పారు. మిత్రధర్మాన్ని టీడీపీ నాయకులు పాటించకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి ఉన్న రాజకీయ అవసరాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ ఎంపీల హెచ్చరికలను పట్టించుకోమని స్పష్టం చేశారు. బడ్జెట్ లో కేటాయిస్తేనే నిధులు వస్తాయనుకోవడం టీడీపీ నాయకుల అవివేకం అని మండిపడ్డారు. ముష్టి, బిక్షం వంటి పదాలను టీడీపీ నాయకులు కట్టిపెట్టాలని సూచించారు. రాజధానికి సంబంధించిన డీపీఆర్‌(డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) రాష్ట్రం నుంచి ఇంకా కేంద్రానికి అందలేదని శ్రీనివాస్‌ రాజు అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన రూ.లక్ష కోట్ల లెక్కలు టీడీపీ నాయకులు చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామని, తమ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హరిబాబు చెప్పిన లెక్కలపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.

మరిన్ని వార్తలు