‘ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళతారు’

14 Dec, 2018 18:09 IST|Sakshi
మాట్లాడుతున్న కృష్ణ సాగర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని  బీజేపీ  అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాఫెల్‌ డీల్‌ మీద సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రఫెల్‌ డీల్‌లో లేనిపోని వివాదం సృష్టింపచి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పై ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత సర్కార్‌ అని క్లారిటీ ఉంది. సుప్రీం కోర్టు తీర్పుతో అది మరింత  స్పష్టమైంది. రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతలు  చవకబారు రాజకీయాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పుతో బహిర్గతమైంది.

అవినీతి లేని ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్‌ పార్టీ తల్లడిల్లుతోంది. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతామని అనుకున్న రాహుల్‌ గాంధీ కలలు ఆవిరి అయ్యాయి...ఇప్పుడు రాహుల్‌  ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్‌ గాంధీ అసత్యాలు మాట్లాడుతారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాహుల్‌ అనుకూడని మాటలు అన్నారు. ఈ తీర్పుతో దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలిపోయిందని కృష్ణ సాగర్‌ రావు చెప్పారు.

మరిన్ని వార్తలు