'ఒమర్‌ అబ్దుల్లాకు షేవింగ్‌ రేజర్‌ పంపించాం'

29 Jan, 2020 08:00 IST|Sakshi

సాక్షి, చెన్నై: గృహ నిర్బంధంలో పెరిగిన గడ్డంతో ఉన్న జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాకు షేవింగ్‌ రేజర్‌ పంపినట్లు తమిళనాడులోని బీజేపీ శ్రేణులు ట్వీట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు నాటి నుంచి గృహనిర్బంధంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఫొటో ఇటీవల ఇంటర్నెట్‌ ద్వారా బయటకు వచ్చింది. గతంలో ఎప్పుడూ శుభ్రంగా షేవింగ్‌ చేసుకునే ఒమర్‌ అబ్దుల్లా ఆ ఫొటోలో దట్టంగా గడ్డం పెరిగిన స్థితిలో వృద్ధునిలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఈ ఫొటోను మాధ్యమాల్లో పెట్టినట్లు సమాచారం. అంతేగాక పలుపార్టీల నేతలు ఉమర్‌ అబ్దుల్లాకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ నేతలు ఉమర్‌ అబ్దుల్లా ఫొటోను హేళన చేశారు. ఉమర్‌ అబ్దుల్లాతో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలంతా స్వేచ్ఛగా తిరుగుతుండగా ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతేగాక అమేజాన్‌ ద్వారా షేవింగ్‌ రేజర్‌ను జమ్ముకశ్మీర్‌లోని ఉమర్‌ అబ్దుల్లా విలాసానికి బుక్‌ చేశారు. దయచేసి దీనిని స్వీకరించండి, ఏదైనా అవసరమైతే మీ కాంగ్రెస్‌ నేతల సహకారం తీసుకోండని ట్వీట్‌ చేశారు.  
(ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు