వాజ్‌పేయి నివాసం వద్ద ఉద్విగ్న వాతావరణం

16 Aug, 2018 15:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మాజీప్రధాని వాజ్‌పేయి నివాసం వద్ద తీవ్ర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన నివాసానికి బీజేపీ అగ్రనేతలు, శ్రేణులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థి గురించి వాకబు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా,  పలువురు కేంద్ర మంత్రులు అనంతరం నేరుగా వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాజ్‌పేయి నివాసానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్‌ పరిసర ప్రాంతల్లోనూ వాహనాలన్నింటినీ ఖాళీ చేయించారు. మరికాసేపట్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బుటెటిన్‌ను ఎయిమ్స్‌ వైద్యులు విడుదల చేయనున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఢిల్లీకి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ రావాలని అధిష్టానం ఆదేశించింది.

మరిన్ని వార్తలు