అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

16 Dec, 2019 14:34 IST|Sakshi

ముంబై : ‘రాహుల్‌ సావర్కర్‌’ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ‘నేను సావర్కర్‌’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. అసెంబ్లీ బయటకూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ టోపీలు ధరించి ఆందోళన చేపట్టారు. హిందుత్వ సిద్ధాంత కర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడిన రాహుల్‌ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫడ్నవీస్‌ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమం గురించి తెలుసుకుని రాహుల్‌ మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు.

కాగా, ‘రేపిన్‌ ఇండియా’ వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ‘ప్రాణాలు పోయినా సరే.. నిజం మాట్లాడి క్షమాపణలు చెప్పబోను’అని రాహుల్‌ తేల్చి చెప్పారు. ‘నేను రాహుల్‌ సావర్కర్‌ను కాదు’అని మాట్లాడి దుమారం రేపారు. ఇదిలాఉండగా.. రాహుల్‌ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం తెలిపింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన హిందుత్వ సిద్ధాంతకర్తను అగౌరపరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది విదితమే.


Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు