‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’

30 Oct, 2019 20:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్‌ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్‌ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ మునిగే నావ..
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు.

మరిన్ని వార్తలు