మీ ఊరికి నిధులు... మాకు ఓట్లు!

2 Dec, 2018 05:59 IST|Sakshi

కేంద్రం నుంచి ఏ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయో వివరిస్తూ గ్రామాలవారీగా బీజేపీ లేఖలు

ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయికి వెళుతున్న బీజేపీ

ఏ పథకం కింద ఎంత నిధులు వచ్చాయనే వివరాల వెల్లడి

నిధులు కేంద్రానివి అయితే, టీఆర్‌ఎస్‌ ఆర్భాటం చేస్తుందని ఆరోపణ

బీజేపీకి ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ‘ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఒక్క ల్యాబర్తి గ్రామానికే నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.1.13 కోట్లు ఇచ్చింది. కానీ, అవన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. ఆ మాటలను నమ్మవద్దు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీ. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’అంటూ గ్రామాలకు బీజేపీ లేఖలు పంపుతూ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఒక్క ల్యాబర్తే కాదు.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కేంద్రం వెచ్చించిన నిధుల మొత్తాన్ని వివరిస్తూ గ్రామాలకు లేఖలు పంపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విస్తృతంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణంలో అన్ని జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది.  
60 నుంచి 90 శాతం నిధులు

కేంద్రం ఇచ్చినవే..
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించిన నిధుల్లో 60 నుంచి 90 శాతం నిధులను నరేంద్రమోదీ ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉపాధి హామీ కింద చెల్లించే కూలీని రూ.169 నుంచి రూ.205 పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని లేఖల్లో వివరించింది. నాలుగేళ్లలో తెలంగాణలోని ఒక్కో గ్రామానికి కేంద్రం రూ. 10 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఇచ్చిందని, అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రకరకాల కారణాలతో దుర్వినియోగం చేసిందని పేర్కొంది. స్వచ్ఛ భారత్‌ కింద ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 7,200–9000 చొప్పున 20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వమే ని«ధులు ఇచ్చిందని వెల్లడించింది. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ట్రైసైకిళ్ల పంపిణీ కోసం కేంద్రం ఒక్కో సైకిల్‌కు రూ.12 వేలు ఇస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని నిరుపయోగం చేసిందని ఆరోపించింది.

రూ.కిలో బియ్యానికి కేంద్రం ఇస్తున్నది రూ.30...
రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా డబ్బును వెచ్చిస్తుంటే టీఆర్‌ఎస్‌ దానిని తమ పథకంగా చెప్పుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. కిలో బియ్యానికి మోదీ ప్రభుత్వం రూ. 30 సబ్సిడీ భరిస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం రూ. 2 వెచ్చిస్తోందని వెల్లడించింది. కేంద్రం ఒక్కో కుటుంబానికి ఈ పథకం కింద ఏటా రూ.8,623 ఖర్చు చేస్తోందని వివరించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద కేంద్రం తెలంగాణకు రూ. 1,500 కోట్లు మంజూరు చేసిందని, రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను అమల్లోకి తెస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోదీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదని వివరించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో తన ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించింది.

పథకాల పేర్లు మార్చి జిమ్మిక్కు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో ప్రసవానికి కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే, పథకాల పేర్లు మార్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ పేర్కొంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద రూ. 6 వేలు కేంద్రం ఇస్తుండగా టీఆర్‌ఎస్‌ ఆ పేరును కేంద్రానికి రాకుండా చేస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో 1.21 లక్షల ఇళ్లకు కేంద్రమే ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిందని తెలిపింది. మద్దతు ధర పెంపు, మొక్కల పెంపకం, సాగునీరు, విత్తన పంపిణీకి కేంద్రం రూ.1,985 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.956 కోట్లు , గొర్రెల పంపిణీ పథకం కోసం కేంద్రం సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నా అవన్నీ టీఆర్‌ఎస్‌ ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు