మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ..!

20 Mar, 2020 14:15 IST|Sakshi

కమల్‌నాథ్‌ రాజీనామాతో.. బీజేపీకి లైన్‌క్లియర్‌

త్వరలోనే గవర్నర్‌ను కలిసే అవకాశం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష బీజేపీకి మార్గం సుగమమైంది. కమల్‌నాథ్‌ రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు విజ్ఞప్తి చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం లేదా ఆదివారమే గవర్నర్‌ లాల్జీ టాండన్‌తో ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. (సీఎం పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా)

బీజేపీ సంబరాలు..
ఈ నేపథ్యంలో కమల్‌ సర్కార్‌ వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదానికి తెరపడింది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం లోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని ధర్మాసనం స్పీకర్‌ ఎస్‌పీ ప్రజాపతిని ఆదేశించింది. ఈ క్రమంలోనే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టతరంగా భావించిన కమల్‌నాథ్‌.. దానికి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో శివరాజ్‌ సింగ్‌ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

కమళానికి లైన్‌ క్లియర్‌..
అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆరుగురు మంత్రులతో పాటు 16 మంది శాసనసభ్యులు (మొత్తం 22) రాజీనామాతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 206కి చేరింది. వీరిలో కాంగ్రెస్‌కు 92 మంది, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఓ ఎస్పీ సభ్యుడు మొన్నటి వరకు కమల్‌నాథ​ సర్కార్‌కు మద్దతు ప్రకటించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో వారు బీజేపీ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సభలో 104 మంది సభ్యుల మద్దతు  ఉంటే సరిపోతుంది. దీంతో బీజేపీకి ఉన్న సభ్యులతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. (స్పీకర్‌ కీలక నిర్ణయం: కమల్‌ రాజీనామా..!)

కర్ణాటక వ్యూహాలే అమలు..
కాగా కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ అక్కడ ప్రయోగించిన వ్యూహాలనే మధ్యప్రదేశ్‌లోనూ అమలు చేసింది. ముందుగా అసంతృప్తులపై వలవేసిన బీజేపీ.. ఆ తరువాత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలను ప్రభుత్వంపై ఉసిగొలిపేలా ఎత్తులు వేసింది. ఈ క్రమంలో అప్పటికే సీఎం కమల్‌నాథ్‌పై పీకల్లోతు కోపంతో ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్యా సింధియాను బీజేపీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ నేతలు విజయవంతం అయ్యారు. దీనికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచనలతో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చక్రం తిప్పారు. చివరికి కర్ణాటకలో చోటుచుసుకున్న పరిణామాలే మధ్యప్రదేశ్‌లోనూ రిపీటైయ్యాయి. అంతిమంగా బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం వచ్చి చేరబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు)

మరిన్ని వార్తలు