లోక్‌సభలో మైనార్టీకి దగ్గరలో బీజేపీ

31 May, 2018 19:04 IST|Sakshi

మైనార్టీకి ఒక్క స్థానం దూరంలో బీజేపీ

282 స్థానాల నుంచి 273కి పడిపోయిన లోక్‌సభ మెజార్టీ

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానే ఉంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లతో భారీ మెజార్టీలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 273 స్థానాలతో మైనార్టీకి ఒక్క స్థానం దూరంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ  ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు వరుసగా ఓటమి చవిచూస్తున్నారు. 13 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్‌ యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య 273కి చేరింది. మరో 12 మంది కూటమి సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. బీజేపీకి ఎంతో పట్టున్న గోరఖ్‌పూర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓడిపోవడంతో 2019లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. యూపీలో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న కాషాయ దళం గోరఖ్‌పూర్‌తో సహా, పూల్పుర్‌, కైరానా స్థానాల్లో ఘోర పరాభావం పాలైంది.

మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లో సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాజస్తాన్‌లో సిట్టింగ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్‌ చేతిలో ఓటమి చవిచూశారు. కర్ణాటక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా విపక్షాల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది.  ఇన్ని పరాజయాల మధ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని వార్తలు