బీజేపీకు 3.. విపక్షాలకు 11

1 Jun, 2018 02:10 IST|Sakshi
లక్నోలో పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకుంటున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు

కైరానా, గోందియాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు

2019 ఎన్నికల కోసం విపక్ష కూటమికి నైతిక బలం

జార్ఖండ్‌లో సత్తాచాటుకున్న జేఎంఎం  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్‌ స్థానంలో) ఓటమిపాలైంది.

ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్‌పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్‌ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్‌వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్‌ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్‌లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.

మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ
మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్‌ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్‌ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్‌ వికాస్‌ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్‌ నుంచి గవిట్‌ బీజేపీలో చేరారు.

అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్‌పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్‌పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్‌సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్‌ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు.  

బిహార్‌లో ఆర్జేడీ.. బెంగాల్‌లో మమత
బిహార్‌లోని జోకిహత్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్‌ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్‌లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్‌–కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు.

కేరళలోని చెంగన్నూర్‌ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్‌ 20,956 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ కంచుకోట షాకోట్‌లో కాంగ్రెస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్‌దేవ్‌ సింగ్‌ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్‌ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్‌ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్‌ నేత ముకుల్‌ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.

యూపీలో హసన్‌ల హవా
2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్‌ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్‌ఎల్‌డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్‌ జరిగింది. విపక్షాల (ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్‌.. యూపీ నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నయీముల్‌ హసన్‌ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్‌ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్‌ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ చెప్పారు.

ఎవరేమన్నారంటే..
ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్‌ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి.    
– మమతా బెనర్జీ
 
ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం.
– అఖిలేశ్‌ యాదవ్‌

నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్‌–మిత్ర పక్షాల విజయం తథ్యం.     
– కాంగ్రెస్‌   

యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది.  
 – సీతారాం ఏచూరి
 
మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్‌లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి.     
– ఎన్సీపీ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా