ప్రగతి లేని కూటమి

24 May, 2019 04:26 IST|Sakshi

కాంగ్రెస్‌ దార్లోనే భాగస్వాములూ తీసికట్టు

జాతీయ ప్రజాస్వామిక కూటమికి (ఎన్‌డీఏ)కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఉమ్మడి ప్రగతిశీల కూటమి(యూపీఏ) కనీసం యుద్ధం కూడా సరిగా చేయకుండా మరోమారు చతికిలపడింది. ప్రతిపక్షమంటే ప్రభుత్వం చేసే ప్రతిపనీ విమర్శించేది కాదని ప్రజలు గుణపాఠం చెప్పారు. ప్రతిపక్షమంటే ప్రజలు చెప్పేది వినే పక్షం కావాలి కానీ, సొంత సోది ప్రజలకు చెప్పే పక్షం కాకూడదని తేల్చి చెప్పారు. 2014తో పోలిస్తే యూపీఏ అత్యంత స్వల్పంగా మెరుగుపడినట్లున్నా, ఎన్‌డీఏ సాధించిన మెజార్టీతో పోలిస్తే తేలిపోయింది.

కూటమిలో ప్రధాన పక్షం కాంగ్రెస్‌ కనీసం 60 సీట్లను కూడా గెలుచుకోలేకపోవడం, కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమేథీ నుంచి ఓటమి పాలవడం, కూటమిలోని ప్రధాన పక్షాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం (డీఎంఏకే మినహా).. యూపీఏ భవితవ్యంపై నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మిత్రపక్షాల్లో ఒక్క డీఎంకే తప్ప మిగిలిన ఏ పార్టీ కనీసం చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే మాత్రం తమిళనాడులో  37 సీట్లలో విజయం సాధించింది.  

కొండంత ‘రాగా’లు తీసి..
యూపీఏకి వెన్నెముక కాంగ్రెస్‌ పార్టీ. 2014లో చతికిలపడిన కాంగ్రెస్‌కి రాహుల్‌ గాంధీ(రాగా)పగ్గాలు చేపట్టడంతో ఉత్సాహం వచ్చింది. గతంతో పోలిస్తే రాహుల్‌లో మార్పు వచ్చింది.. ప్రసంగాల్లో పరిణితి వచ్చింది.. దేశానికి భవిష్యత్‌ నేతగా ఎదిగాడు.. మోదీని మించిపోయాడు.. అని కాంగ్రెస్‌ వాదులు మురిసిపోవడంలో మునిగిపోయారు. ఇందుకు తగ్గట్లే ఇటీవల మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించింది. దీంతో రాహుల్‌పై కాంగ్రెస్‌కు మరింత ధీమా పెరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు మాత్రం తేడాకొట్టాయి.

రాహుల్‌ను చూసి కాంగ్రెస్‌ శ్రేణులు మురిసినట్లు ప్రజలు మక్కువ చూపలేదని, ఆయనలో ఇంకా సమర్థత పొడ ప్రజలకు కనిపించలేదని, దేశ్‌కీ నేతగా ఎదగాలంటే మరింత శ్రమించాలని ప్రజలు తీర్పునిచ్చారు. వారసత్వం సరిపోదని, నాయకుడంటే ప్రజలకు తనపై విశ్వాసం కలిగించాలని రాహుల్‌కు అర్ధమయ్యేలా చెప్పారు. కూటమికి నేతృత్వం వహిస్తున్నారన్న మాటేకానీ ఆయన్ను ప్రధానిగా కూటమిలోని పక్షాలే కొన్ని ఒప్పుకోలేదు. కూటమిలోనే ఏకాభిప్రాయం సాధించలేని వ్యక్తిగా ప్రజల్లో రాహుల్‌పై ముద్ర పడింది. దీనికితోడు ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంకను అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడం రాగాకు, కాంగ్రెస్‌కు నష్టమే కలిగించింది.  రాహుల్‌కు సత్తా లేకపోవడంతోనే ఆమెను రంగంలోకి దించారని ప్రజలకు అనిపించింది.

పొత్తులు.. చిత్తు
కూటమిగా 2 మార్లు అధికారంలో ఉన్న యూపీఏ ఈ సారి బలహీనపడింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఎస్పీ, బీఎస్‌పీ నిరాకరించడం తీవ్ర ప్రభావం చూపింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాల్సిన కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయలేకపోయింది. ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, ఎండీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు తోడుగా ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కీలకమైన బెంగాల్, యూపీల్లో పొత్తు లేకపోవడం, దక్షిణాదిన కేరళ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ ప్రాభవం బాగా క్షీణించడం యూపీఏపై ప్రభావం చూపాయి.

రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వానికి అంగీకరించని మాయావతి, మమతా బెనర్జీ ఏకంగా ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలుగన్నారు. వీరిద్దరి ఆశ అంతిమంగా కాంగ్రెస్‌ని దెబ్బతీసింది. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించేందుకు రాహుల్‌ నాయకత్వ చరిష్మా సరిపోలేదు. చివరి నిమిషం వరకు ఢిల్లీలో చర్చలు జరిపినా ఆప్‌తో పొత్తు కుదరలేదు. తెలంగాణలో టీడీపీతో ఉన్న పొత్తు ఏపీలో కనిపించలేదు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా అనుక్షణం జేడీఎస్‌తో కీచులా టలే. మరోపక్క ఎన్‌డీఏ కొందరు మిత్రులను కోల్పోయినా సొంతంగా పలుచోట్ల బలం పెంచుకుంది. కానీ కాంగ్రెస్‌ మాత్రం పొత్తు ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేకపోయింది.

రాజీనామా చేస్తారా?
రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టాక ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎదుర్కొన్న తొలి పూర్తిస్థాయి ఎన్నికలు ఇవి. కొందరు రాహుల్‌ను ‘పప్పు’ అంటూ తిరస్కరించారు. మరికొందరేమో యువరాజులాంటి వాడని తిరస్కరించారు. ఏదేమైనా ఈఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమికి పూర్తిస్థాయి బాధ్యత తనదేనని రాహుల్‌ ప్రకటించారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ‘ఓటమికి బాధ్యత మీదేనని ఒప్పుకున్నారు కాబట్టి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తారంటూ వెళ్లిపోయారు. మరి పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

పనిచేయని ప్రియాంక ‘మేజిక్‌’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తాము తురుపు ముక్కగా భావించి బరిలోకి దించిన ప్రియాంకా గాంధీ వాద్రా ఓటర్లను ఆకర్షిస్తారనే కాంగ్రెస్‌ భావించింది. అయితే ఈ విషయంలో ఆమె పెద్దగా విజయం సాధించలేకపోయారనే చెప్పవచ్చు. 47 ఏళ్ల ప్రియాంకా ఏఐసీసీ ఉత్తరప్రదేశ్‌ (తూర్పు) జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో సామాన్యుల దగ్గరకు అరమరికలు లేకుండా నడచివెళ్లడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, మోదీ అనుకూల నినాదాలు చేస్తున్న వారి వద్దకు స్వయంగా నడచివెళ్లి వారితో కరచాలనం చేయడం, పాములను సైతం పట్టుకోవడం వంటి ఎన్నో ఆకర్షణీయమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ విధానాల్లో లొసుగులను వివరించడమూ చేశారు. మరోవైపు తన అన్న రాహుల్‌కే ప్రచారంలో అధిక ప్రాధాన్యత ఇస్తూ, తాను మద్దతుదారు మాత్రమేనన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఆమె చర్యలు ఓట్లరూపంలోకి మారలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ ఇవ్వలేకపోయారు. ప్రియాంక తన ఎన్నికల ప్రచారంలో వాస్తవ పరిస్థితి అనుగుణంగానే మసలుకున్నారు. తన వద్ద ఇంద్రజాలం ఏదీ లేదని, పార్టీని పటిష్టం చేయాల్సింది కార్యకర్తలేనని తరచూ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌