బీజేపీకి బుద్ధి చెప్పాలనుకున్నాం.. చెప్పాం

16 Mar, 2018 11:39 IST|Sakshi

సాక్షి, చండీగఢ్‌ : నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్న బీజేపీకి తాము బుద్ధి చెప్పాలనుకున్నామని, అనుకున్నట్లుగానే చెప్పామని బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో తాము ఊహించినట్లుగానే బీజేపీని ఓడించామని చెప్పారు. అనూహ్యంగా ఓటమి పాలయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు పిలుపునిస్తుందేమోనని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ర్యాలీలో మాట్లాడిన మాయవతి కేంద్రంలో బీజేపీ నియంతలా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను బలహీన పరుస్తోందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 1975లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు.

'ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మేం ఓ గుణపాఠం చెప్పాలని అనుకున్నాం. అందుకే ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి వారు ఓడిపోయేలా చేశాం. ఈ ఫలితాలకు వారికి నిద్రలేకుండాపోయింది. ఈ ఫలితాలతో ముందస్తుగానే బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే మరింత నష్టం చవిచూడాల్సి వస్తుందని బీజేపీకి తెలుసు. మోదీ ఒకప్పుడు లంచాల విషయంలో నేను తినను.. వేరే వాళ్లను తిననివ్వను అంటూ నినాదాలు చేశారు. కానీ, కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగాయి.

లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌మోదీ చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద కుంభకోణాలే. మొత్తం మింగేయండి అనే నినాదాన్ని ఈ కుంభకోణాలు నిరూపించాయి. అవినీతి పరుల నుంచి నల్లడబ్బు లాగేశామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిని పేద ప్రజలకు ఉపయోగించకుండా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టింది. బ్లాక్‌మనీ పేరిట కేంద్రం వారికి రాజకీయంగా ఎదురుపడేవారిని లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో సొంత పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు మాత్రం కప్పిపుచ్చుకుంది' అని ఆమె ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు