బీజేపీ అధికారం కోల్పోనుందా..?!

7 Dec, 2018 18:56 IST|Sakshi

భోపాల్‌ : గత మూడు పర్యాయాలుగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టడానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరి పోరు ఉన్నట్టు పలు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు వెల్లడించాయి. నవంబర్‌ 28న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శుక్రవారం సాయంత్రం పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ న్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ 126 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని అంచనా. బీజేపీ 94 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోతుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది.

ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పాలనపట్ల ప్రజలకు పెద్దగా ప్రతికూలత లేనప్పటికీ సుదీర్ఘంగా అధికారంలో ఉండడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సరళి ఎలా ఉండొచ్చు అన్నది ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ 116 అన్న సంగతి తెలిసిందే.

ఇక ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే కాంగ్రెస్‌కు 113, బీజేపీకి 111, బీఎస్పీకి 2, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లు మేజిక్‌ ఫిగర్‌కు కొం‍త దూరంలో ఉంటాయని విశ్లేషించింది. అయితే, టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్‌ ఇందుకు భిన్నంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించింది. బీజేపీ పూర్తి ఆదిక్యంతో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని తన సర్వేలో తెలిపింది. బీజేపీకి126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు, బీఎస్పీకి 6, ఇతరులకు 9 సీట్లు వస్తాయని వెల్లడించింది. 

2000 నవంబర్ 1న కేంద్రంలోని అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేటప్పటికి.. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోకాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడం గమనార్హం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు