బీజేపీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

12 Mar, 2018 12:29 IST|Sakshi
బీజేపీ చిహ్నం.. ఇన్‌ సెట్‌లో ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌

డెహ్రాడూన్‌ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకరిపై ఉత్తరాఖండ్‌ పోలీసులు కేసు నమోదు అయ్యింది. దళిత మహిళలపై చెయ్యి చేసుకోవటం.. వారిని కులం పేరుతో దూషించిన ఘటనలో ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ థూక్రాల్‌ పై అభియోగాలు నమోదయ్యాయి.

విషయం ఏంటంటే... స్థానికంగా ఉండే దళిత కుటుంబాలకు చెందిన ఒక యువతి, యువకుడు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో ఆ ఇంటి పెద్దలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అయితే తన నియోజకవర్గం(రుద్రాపూర్‌) పరిధిలోనే ఈ ఘటన చేసుకోవటంతో సంధి కోసం థూక్రల్‌ ఆ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించారు. ఈ క్రమంలో వారు ఆయన ముందే వాదులాడుకోగా.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే మహిళలను దూషిస్తూ చెయ్యి చేసుకున్నారు. 

దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతుండటంతో పోలీసులు ఆదివారం రాజ్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

నాదేం తప్పు లేదు... ‘ఆ మహిళలిద్దరికీ సర్దిచెప్పేందుకు రెండు గంటలు శ్రమించా. అంతా సరే అనుకుని ఇంటి బయటకు వెళ్లాక వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిని నియంత్రించేందుకు ఎంతో ప్రయత్నించా. వీలు కాకపోవటంతోనే దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. వారిని దూషించిన మాట అవాస్తవం’ అని రాజ్‌కుమార్‌ మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌ను వివరణ కోరుతు నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు