గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యే దాష్టీకం

4 Jun, 2019 04:43 IST|Sakshi
తన్నుతున్న ఎమ్మెల్యే (వృత్తంలో కాషాయం రంగు చొక్కా వ్యక్తి)

నీళ్లడిగిన మహిళను బూటుకాలితో తన్నిన వైనం

ఆహ్మదాబాద్‌: పట్టపగలు, నడిరోడ్డు మీద ఒక మహిళ అని చూడకుండా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దాష్టీకానికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ముఖాన్ని బూటు కాలుతో తొక్కారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే తమ ప్రాంతానికి నీటి సరఫరా ఎప్పట్నుంచి పునరుద్ధరిస్తారని ప్రశ్నించడమే. సంబంధిత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో క్షమాపణలు చెప్పాడు. గుజరాత్‌లోని నరోదా పట్టణంలో స్థానిక ఎన్సీపీ మహిళా నేత తేజ్‌వని తమ సమస్యపై తొలుత అక్కడి కార్పొరేటర్, బీజేపీ ఎమ్మెల్యే బలరామ్‌ థావాని సోదరుడు కిశోర్‌ థావానీని సంప్రదించారు.

ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆయన పట్టించుకోలేదు. పైగా దుర్భాషలాడారు. ఐదారు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తేజ్‌వని అహ్మదాబాద్‌లో మేఘాని నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి తమ ప్రాంతంలోని ఇతర మహిళలతో కలసి వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఆఫీసులో లేరు. అయితే ఆయన మద్దతుదారులు వారిని దుర్భాషలాడటంతో మహిళలు కిశోర్‌ థావానీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. ఇంతలో ఎమ్మెల్యే బలరామ్‌ వచ్చారు.

‘వస్తూ వస్తూనే ఆవేశంగా నా చేతిలో మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడు. నా కడుపులో తన్నాడు. నేను కింద పడిపోతే కాళ్లతో నా ముఖం మీద కొట్టడం మొదలు పెట్టాడు. చివరికి కర్రతో కూడా కొట్టాడు. నా భర్త అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతని అనుచులు ఆయనను అక్కడ నుంచి గెంటేశారు‘‘అని తేజ్‌వని వివరించారు. ఈ ఘటన వీడియో యూ ట్యూబ్‌లో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. కాగా ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎన్సీపీ డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు