‘సమస్యల గురించి చెప్తే.. సీటు దక్కుతుందో..లేదో..’

26 Dec, 2018 13:12 IST|Sakshi

సాక్షి, పశ్చివ గోదావరి : పచ్చకండువా ఉంటే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వాపోయారు. సమస్యల ప్రస్తావన తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదోనని టీడీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని వాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులతోనే జరుగుతోంది. జిల్లా ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. స్థానిక టీడీపీ నాయకుల స్వార్థం కారణంగానే ఎలాంటి పనులు జరగడం లేదు. నిట్‌ (నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని తాడేపల్లిగూడెం నుంచి ఆకివీడుకి తరలించే ప్రయత్నం చేసినపుడు కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. ఫిషింగ్ హార్బర్, డెల్టా ఆధునికీకరణ, ఆక్వా యూనివర్సిటి వంటి సమస్యల పరిష్కారం కాలేదు. అవన్నీ హమీలకే పరిమితం అయ్యాయి’ అని చెప్పారు. (ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం)

పశ్చిమ గోదావరి జిల్లాను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా జిల్లాకు న్యాయం జరగలేదని ఆగ్రహం వక్యం చేశారు. పశ్చిమ వాసులకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదనీ, దానికోసం పోరాడుతున్నా​ చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేవలం ఆ పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని విమర్శించారు. ‘ఏ ఇండస్ట్రీ వచ్చినా సీఎం ఆయన సొంత జిల్లాకు తరలించాలని చూస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చెప్పాలి’  అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాణిక్యాలరావు టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు