సీఏఏపై చర్చ.. బిల్లు పేపర్లు చించేసిన ఎమ్మెల్యే

16 Mar, 2020 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్‌ పాస్‌ చేసిన బిల్లు పేపర్లను చించివేస్తూ నిరసన తెలిపారు. రాజాసింగ్‌ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కేవలం ఎంఐఎం దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకే సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. (దేశానికి ఈ చట్టం అవసరం లేదు: కేసీఆర్‌)

సభలో ఎంఐఎం గంటసేపు మాట్లాడారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల దేశంలోని మైనార్టీలకు సమస్య లేదని అమిత్‌షా తెలిపారని అన్నారు. ఎంఐఎం పార్టీని ఖుషీ చేయాలనే కేసీఆర్‌ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఏది చెబితే సీఎం అదే చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కర్ఫ్యూ తరహాలో భయానక వాతావరణం సృష్టించి సమగ్ర కుటుంబ సర్వే చేయించారని విమర్శించారు. తెలంగాణ వివరాలు కేంద్రానికి వెళ్లవద్దని కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. (రాక్షసుల్లా తయారయ్యారు) 

‘‘ముఖ్యమంత్రికి ఇంత కూడా తెలివి లేదా. ఎన్నార్సీపై ఇంకా నిర్ణయం కాలేదు. దానిపైన కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసారు. దేశం అనాథాశ్రమం కాదు.1985లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నార్సీ తెచ్చారు. సీఏఏ.. ఎన్పీఆర్.. ఎన్ఆర్సీకి సబంధం లేదు. ఎంఐఎంకు గులాంగిరి చేసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలియ జేస్తాం. ప్రజలపై ఒత్తిడి తీసుకు వచ్చి తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేస్తాం. ఈ తీర్మానం ఫాల్తూ రిజల్యూషన్. ఇది ఎందుకు పనికి రాని తీర్మానం.’’ అని టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు