రాష్ట్ర ప్రభుత్వ ధనదాహం మితిమీరింది

22 Apr, 2018 03:04 IST|Sakshi
సోము వీర్రాజు (ఫైల్‌ ఫోటో)

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో అవినీతి, అక్రమాలతో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, పాలనను గాడిలో పెట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అవినీతి పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ ఏడాది చుక్కలు చూపిస్తామన్నారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో దాదాపు 3,600 సర్వశిక్షా అభియాన్‌ స్కూళ్లకు సున్నం వేయడానికి రూ.120 కోట్లు మంజూరు చేశారు.

సుమారు 10 వేల ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఆట వస్తువులకు రూ.4 కోట్లే ఇచ్చారు. స్కూళ్లకు సున్నం వేసేందుకు  రూ.2 కోట్లు ఖర్చు అయింది. మిగతా రూ.118 కోట్లు ఏమయ్యాయి? ‘నీరు చెట్టు’ పనులతో భూమిని అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యేల పొలాలను నీరు చెట్టు మట్టితో చదును చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణకు రూ.420 కోట్లు మంజూరు చేశారు. ఆరు నెలలైనా ఒక్క శాతం కూడా మరమ్మతులు చేయలేదు. కానీ సీఎం డ్యాష్‌ బోర్డులో 99 శాతం బాగున్నట్లు చూపిస్తారు. ఓ ఎంపీ కోడలు సర్వశిక్షా అభియాన్‌లో తల్లుల శిక్షణ ఇచ్చామంటూ ఇవ్వని శిక్షణకు రూ.25 కోట్లకు బిల్లు పెట్టారు. దాన్ని పరిశీలించి కేంద్రం ఆపేసింది’ అని అన్నారు.

హోదాపై ఏమన్నావ్‌ చంద్రబాబూ? 
‘ప్రత్యేక హోదా ఉన్న హిమాచల్, అసోం రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయని చంద్రబాబు అన్నారు. నేనేమైనా తెలివి తక్కువ వాడినా అన్నారు. హోదా అంటే జైలన్నారు. కేసులు పెట్టించారు. హోదా ముగిసిన అధ్యాయమన్నారు. నాలుగేళ్ల తర్వాత ధర్మ పోరాటమంటున్నారు’ అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

మరిన్ని వార్తలు