ఏపీ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్‌ టీడీపీ

21 Mar, 2018 18:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య  మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్‌ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు.

30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్‌ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్‌ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్‌ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.  

దమ్ముంటే రాజీనామాలు చేయండి..
ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ‍్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్‌ రాజు సవాల్‌ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ‍్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్‌ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

మంత్రుల భాష సరిగా లేదు
ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్‌ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు