అమాత్యులు కాలేక ఆక్రోశం 

23 Aug, 2019 08:45 IST|Sakshi

పలువురు బీజేపీ ఎమ్మెల్యేల కినుక  

అధిష్టానానికి సీఎం యడ్డి ఫిర్యాదు  

ఎవరూ క్రమశిక్షణ తప్పరాదన్న నాయకత్వం  

సాక్షి, బెంగళూరు: అధికార బీజేపీలో కొత్తగా మంత్రి పదవుల సెగ అలముకొంటోంది. మంత్రివర్గంలో చోటు దక్కని వారు కొందరు బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మంత్రి పదవి వరించినవారు మంచి శాఖ కావాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, అసలు పదవే లేనివారు కినుక వహించారు. అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అధిష్టానం సహాయం కోరారు. రెండో విడతలో మంత్రి పదవి ఇస్తే సరి, లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధహని పలువురు ఎమ్మెల్యేలు సంకేతాలిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన సోదరుడు రమేశ్‌ కత్తికి టికెట్‌ ఇవ్వలేదని, తాజాగా మంత్రివర్గంలో తనకు చోటు ఇవ్వలేదని సీనియర్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌కత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అథణి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ సవదికి మంత్రి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.

క్రమశిక్షణ చర్యలు తప్పవు 
మంత్రి పదవులు రాలేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, బెదిరింపులకూ దిగుతున్నారని పార్టీ నాయకత్వానికి సీఎం యడియూరప్ప ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంతో బీజేపీ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగకుండా చూసుకోవాలని,  క్రమశిక్షణను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి నుంచి తిరుగుబాటు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుందని చెప్పారు.
 
 రెండు డజన్ల ఆశావహులు  
ఈ తరుణంలో రెండోవిడత విస్తరణ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు పెద్ద సవాల్‌గా మారింది. బీజేపీ నుంచి మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ప్రస్తుతం 20 మంది పైగా ఆశావహులు ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ –జేడీఎస్‌ నుంచి అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకొన్నారు. బీజేపీ సీనియర్లు ఉమేశ్‌ కత్తి, యత్నాళ్, తిప్పారెడ్డి, గూళిహట్టి శేఖర్, కేజీæ బోపయ్య, అప్ప చ్చు రంజన్, పూర్ణిమ, మురుగేశ్‌ నిరాణి, శివన గౌడ నాయక్, అభయపాటిల్, దత్తాత్రేయ పాటి ల్, అంగార, బాలచంద్ర జార్కిహోళి, రేణుకాచా ర్య, హాలాడి శ్రీనివాసశెట్టి, విశ్వనాథ్‌ తదితరులు పదవులు దక్కక గుర్రుగా ఉన్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు